: 45 మంది మంత్రులను ఉత్తరప్రదేశ్ కు పంపుతున్న నరేంద్ర మోదీ!
తొలిసారిగా ఓ ఈశాన్య రాష్ట్రంలో పాగా వేసిన ఆనందంలో ఉన్న నరేంద్ర మోదీ, వచ్చే సంవత్సరం యూపీలో జరగనున్న ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించిన ఆయన, యూపీకి ఏకంగా 45 మంది కేంద్ర మంత్రులను పంపుతున్నారు. రెండేళ్ల పాలనా వేడుకలను 'వికాస్ పర్వ్' పేరిట ఘనంగా నిర్వహించనున్న ఎన్డీయే తరఫున మంత్రులంతా యూపీలో పర్యటించాలని మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రుల పర్యటనలు, వారు ప్రసంగించాల్సిన సభల ఏర్పాట్లను గురించి జిల్లా కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయని బీజేపీ యూపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ వ్యాఖ్యానించారు. అరుణ్ జైట్లీ, ప్రకాష్ ఝా తదితరులు లక్నోలో ఉండి మంత్రుల పర్యటనలను ఖరారు చేస్తారని, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, వీరేంద్ర సింగ్, హర్ సిమ్రత్ కౌర్, మనోజ్ సిన్హా, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నితిన్ గడ్కరీ, జయంత్ సిన్హా, నజ్మా హెప్తుల్లా, శ్రీపాద నాయక్, సురేష్ ప్రభు తదితర మంత్రులంతా పర్యటిస్తారని తెలిపారు.