: వైఎస్ జగన్ గ్రాఫ్ తగ్గుతోంది!... నేను మళ్లీ గెలవలేకపోతే చెప్పులు మెడలో వేసుకుంటా!: జలీల్ ఖాన్
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవలే టీడీపీలో చేరిన మైనారిటీ నేత జలీల్ ఖాన్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని ఆరోపించిన ఆయన... ఆ కారణంగానే టీడీపీలో చేరానని పేర్కొన్నారు. తనకు శక్తి యుక్తి ఉంటే మంత్రి పదవి వస్తుందని పేర్కొన్న ఆయన మంత్రి పదవి రాకున్నా ఇబ్బందేమీ లేదని తేల్చేశారు. కేవలం మంత్రి పదవి కోసమే తాను టీడీపీలో చేరలేదని కుండబద్దలు కొట్టారు. వైసీపీ టికెట్ పై గెలిచిన తాను ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచే సత్తా ఉందని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలో గెలవలేకపోతే చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో తాను గెలిస్తే వైసీపీని మూసేస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు దుర్గ గుడి ఫ్లైఓవర్ కాంట్రాక్టులో తనకు ఎలాంటి సబ్ కాంట్రాక్టులు లేవని ఆయన స్పష్టం చేశారు.