: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు, బాధితులంతా గుంటూరు జిల్లా వాసులే
ఒడిశాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిండా యాత్రికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి కటక్ సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నవారంతా గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారేనట. ప్రమాదంపై కాస్తంత వేగంగానే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఘటనపై ఆరా తీశారు. ఒడిశా సర్కారుతో మాట్లాడి క్షతగాత్రులకు సాయమందించాలని ఆయన ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ డీజీపి జేవీ రాముడు ఒడిశా డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. క్షతగాత్రులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఓడిశా డీజీపీని కోరారు.