: రేపటి నుంచి రోహిణీ కార్తె... ఠారెత్తిస్తున్న ఎండ!
రోళ్లు పగిలే రోజులు వచ్చేశాయి. రేపటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా మేఘాలతో కాస్తంత చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేడు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. కరెంటు వాడకం సైతం గరిష్ఠస్థాయికి చేరిపోయింది. భానుడి భగభగలకు బయటకు రావాలంటేనే జడిసే పరిస్థితి నెలకొంది. మరో వారం రోజుల పాటు ఎండ వేడిమి అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.