: బీహార్ లో మరోఘోరం... యువతిపై అఘాయిత్యం!
అత్యాచారాలు, హత్యలతో బీహార్ లో జంగిల్ రాజ్ అమలవుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిజం చేసే ఘటనలు ఒక్కొక్కటిగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన వివరాల్లోకి వెళ్తే...ఉత్తర బీహార్ లోని మధుబని సమీపంలోని ఒక పొదలో తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన స్థితిలో ఓ యువతి అక్కడి స్థానికుడికి కనిపించింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన స్థానికుడు ఆసుపత్రిలో చేర్చారు. దీంతో వైద్యం ప్రారంభించిన వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె నిన్న కాసేపు స్పృహలోకి వచ్చింది. దీంతో పోలీసులు, మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ సందర్భంగా తాను 12 తరగతి చదువుతున్నానని, తనపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారని, తరువాత కత్తితో పొడిచారని తెలిపింది. చికిత్స చేసిన వైద్యులు ఆమెను 16 సార్లు కత్తితో పొడిచారని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమె మరణించి ఉంటుందని భావించి వెళ్లిపోయి ఉంటారని తెలిపారు. కాగా, సంఘటనాస్థలి వద్ద ఒక ఎటిఎం కార్డు, మొబైల్ ఫోన్, ఒక కత్తి లభించడంతో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్థానిక ఆటో డ్రైవరు మొహమ్మద్ సులేమాన్ పేరుతో రిజిస్టర్ కావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. కాగా, బీహార్ లో జంగిల్ రాజ్ ప్రారంభమైందని, ముఖ్యమంత్రి నేరాలను అదుపు చేయలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.