: ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాలి కానీ, సాంకేతిక సమస్యలు ఉన్నాయి: రైల్వే మంత్రి సురేష్ ప్రభు


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉంది కానీ, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏపీకి రైల్వే జోన్ పై ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గత రైల్వే బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు నిధులు గణనీయంగా పెంచామని ఆయన తెలిపారు. ప్రతి దక్షిణాది రాష్ట్రానికి ఓ సమన్వయ అధికారిని నియమించామని ఆయన చెప్పారు. కాగా, ఏపీకి రైల్వే జోన్ డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉంది. అయితే భువనేశ్వర్ కేంద్రంగా రైల్వే జోన్ ఉండడంతో రైల్వే అధికారులు విశాఖ రైల్వేజోన్ ను అంగీకరించడం లేదు. భువనేశ్వర్ రైల్వే జోన్ కు రాయఘడ, అరకు లేన్ లు అధిక ఆదాయ మార్గాలు. భిలాయ్, స్టీల్ ప్లాంట్ నుంచి ఇనుము ఎగుమతికి వాల్తేరు డివిజన్ ఎంతో కాలంగా విశేషమైన సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశా రైల్వే జోన్ కి అధిక ఆదాయం అందించే విశాఖను కోల్పోవడం ఇష్టం లేదు. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే జోన్ కు విశాఖ, విజయవాడల నుంచి ఇతర ప్రాంతాలకు తరలే ప్రయాణికులే ఆధారం. దీంతో సికింద్రాబాద్ రైల్వే జోన్ కూడా విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. సరకు, ప్రయాణికుల రవాణాలు విశాఖ రైల్వే జోన్ కు వెళ్తే...తమ ఆదాయాలకు గండిపడుతుందన్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ డిమాండ్ పైకి లేచిన ప్రతిసారి 'సాంకేతిక కారణాలు' అంటూ కారణం చూపుతూ జోన్ ను నిరాకరిస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే విధానంతో ఎన్డీయే ముందుకు సాగుతోంది.

  • Loading...

More Telugu News