: మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారానికి మోదీ, షేక్‌ హసీనా, కేజ్రీ, అఖిలేష్, నితీశ్‌ లకు ఆహ్వానం


ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి మ‌మ‌తా బెన‌ర్జీ అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెనర్జీ ఈ నెల 27న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మ‌మ‌తా బెనర్జీ ప్ర‌మాణ స్వీకార‌ కార్య‌క్ర‌మానికి దేశ ప్ర‌ధాని మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్‌ హసీనా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్ యాద‌వ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీ, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధినేత లాలూ ప్ర‌సాద్ తో పాటు ప‌లువురు నేత‌లను ఆహ్వానించినట్టు తృణ‌మూల్ కాంగ్రెస్ నేత ఒక‌రు ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు బెంగాల్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారంద‌రూ అక్క‌డి రాజ్‌భ‌వ‌న్ వేదిక‌పైనే స్వీక‌రించార‌ని, ఈసారి మ‌మ‌త ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి అక్క‌డి రెడ్ రోడ్ వేదిక కానుంద‌ని ఆయన తెలిపారు. ఈ వేదిక‌పై ప్ర‌మాణ స్వీకారోత్స‌వం చేస్తే ఎంతో మంది ప్ర‌జ‌లు ఈ వేడుక‌ను చూసే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ 294 సీట్ల‌లో 211 సీట్లు గెలుపొందిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News