: విజయ్ మాల్యాకు గ్యారెంటీ ఇచ్చావంటూ బక్క రైతును పట్టుకున్న బ్యాంకులు... లబోదిబోమంటున్న రైతు!
ఆ బక్క రైతన్న పేరు మన్మోహన్ సింగ్. పిలిభిత్ సమీపంలోని ఖజూరియా నవిరామ్ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడ్డ పేద వ్యక్తి. ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు, ఉన్న కొద్దిపాటి పొలం ఆధారంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడతని బ్యాంకు ఖాతా స్తంభించిపోయింది. దానికి కారణం తెలుసుకుంటే, ప్రతి ఒక్కరికీ భారత బ్యాంకింగ్ వ్యవస్థపైనా, అధికారుల తీరుపైనా ఆగ్రహం రాకమానదు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ గ్యారంటీ ఉన్నాడట. విజయ్ మాల్యా ఎవరో, తన బ్యాంకు ఖాతాను ఎందుకు ఫ్రీజ్ చేశారో తెలియని అమాయక ఈ రైతు మన్మోహన్. తన గ్రామానికి దగ్గర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఈ రైతుకు ఖాతా ఉండగా, ఆయన మాల్యాకు గ్యారంటార్ గా ఉన్నారని, తక్షణం ఖాతా సీజ్ చేయాలని ముంబై హెడ్డాఫీసు నుంచి వచ్చిన తాఖీదుకు స్పందించిన బ్యాంకు అధికారులు ఆయన ఖాతాలను స్తంభింపజేశారు. "ఇది ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. మాల్యా గురించి నాకు ఎంతమాత్రమూ తెలియదు. నేనెప్పుడూ ముంబైకి వెళ్లను కూడా లేదు. ఖాతాలు నిలిపివేయడంతో, ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీములు నాకు చేరడం లేదు. ఇల్లు గడిచేందుకు డబ్బు అవసరమై నా పంటనంతా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అమ్మి కనీస మద్దతు ధర పొందుదామని భావిస్తే కుదరలేదు. ఆ డబ్బు బ్యాంకు ఖాతాలోకి వస్తుంది కదా? నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. తరువాతి పంట విషయం ఏమవుతుందో?" అని ఆ రైతు లబోదిబోమన్నాడు. బడాబాబుల విషయంలో ఏమీ చేయలేకపోతున్న బ్యాంకులు, ఈ తరహా తప్పులు చేస్తూ, పేదల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకూ సమంజసమని మన్మోహన్ కథను విన్న ప్రతిఒక్కరూ విమర్శిస్తున్నారు.