: నడిరోడ్డుపై వేధింపులకు గురవుతున్న 79 శాతం భారత మహిళలు!
ఇండియాలోని ప్రతి ఐదుగురు మహిళల్లో సుమారు నలుగురు మహిళలు నడి వీధుల్లో ఏదో ఒకరకమైన వేధింపులకు గురికాబడ్డ వారే. అంటే 79 శాతం మంది మహిళలు మన దేశంలో పబ్లిక్ హరాస్ మెంటుకు గురవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు రక్షణగా ఉన్న నగరాల జాబితా కోసం బ్రిటన్ కు చెందిన యాక్షన్ ఎయిడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్ కు సంబంధించినంత వరకూ 39 శాతం మంది మహిళలు, తాము వీధుల్లో వెళుతుంటే, మృగాళ్లు చెప్పుకోలేని చోట తాకుతున్నారని వెల్లడించారు. యూకేతో పాటు థాయ్ ల్యాండ్, బ్రెజిల్, ఇండియాల్లో ఈ సర్వే నిర్వహించగా, ఇండియాలోని 16 ఏళ్లకు పైబడిన 2,500 మందిని ప్రశ్నించినట్టు యాక్షన్ ఎయిడ్ వెల్లడించింది. 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 84 శాతం మంది, ఉద్యోగాలు చేస్తున్న వారిలో 82 శాతం మంది, చదువుకుంటున్న అమ్మాయిల్లో 68 శాతం మంది వేధింపులకు గురవుతున్నారు. ఇక మిగతా దేశాల విషయానికి వస్తే, బ్రెజిల్ లో 89 శాతం, థాయ్ ల్యాండ్ లో 86 శాతం, బ్రిటన్ లో 75 శాతం మందికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఇండియాలో తమను తాకుతున్నారని 39 శాతం మంది వెల్లడించగా, బ్రెజిల్ లో 41 శాతం, థాయ్ ల్యాండ్ లో 44 శాతం, యూకేలో 23 శాతం మంది తమకు ఇదే విధమైన అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించడం గమనార్హం. వీధుల్లో ఒంటరిగా నడవాలంటే భయంగా ఉందని, బస్సులు ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నామని 65 శాతం మంది భారత మహిళలు వెల్లడించినట్టు యాక్షన్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ షెహ్జో సింగ్ తెలియజేశారు.