: కూలిన చెట్లు 238... ఇంకా తేరుకోని భాగ్యనగరి
వరుణుడికి వాయుదేవుడు తోడై అరగంటపాటు సృష్టించిన బీభత్సం నుంచి భాగ్యనగరి ఇంకా తేరుకోలేదు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈదురుగాలులకు తోడుగా వచ్చిన భారీ వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 238 వృక్షాలు నేలకు ఒరిగాయని, వీటిల్లో 100కు పైగా చెట్లు రహదారులపై పడగా, వాటిల్లో 80 వరకూ తొలగించామని, పనులింకా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. మెహిదీపట్నం, బంజారాహిల్స్, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల విద్యుత్ ను పునరుద్ధరించామని పేర్కొన్నారు. కాగా, వర్ష బీభత్సానికి భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 50కి పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ధ్వంసమయ్యాయి. ప్లాస్టిక్ నీటి ట్యాంకర్ ఎగిరొచ్చి పడి ఒక వ్యక్తి, రేకులు ఎగిరిపడి మరో వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక, మునిసిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని చెబుతుండగా, అధికారులు ఎంత మాత్రమూ స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.