: ‘అన్న’ ఎన్టీఆర్, ‘అమ్మ’ జయలలితకు నాడు ఒకే తీరులో అవమానాలు... శపథాలు!
సినీరంగంలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమదైన చెరగని ముద్ర వేసిన వారిలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు, తమిళనాడుకు చెందిన జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో... అదేవిధంగా, తమిళనాడులో జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయా అసెంబ్లీలలో చోటు చేసుకున్న సంఘటనలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే... నాడు వారిద్దరు సవాళ్లు విసిరి అధికార పీఠాలను కైవసం చేసుకున్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ సంఘటనలేమిటంటే... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనపై కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఎన్టీఆర్...స్పీకర్ పోడియం వద్దకు వేగంగా నడచుకుంటూ వెళ్లారు. ఎన్టీఆర్ వెళుతుండటం చూస్తున్న నాటి అధికార కాంగ్రెస్ సభ్యులు, పోడియం ముందు ఆయన బైఠాయిస్తారని అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన భుజంపై ఉన్న కండువాను తీసి స్పీకర్ పోడియంపై పెట్టారు. ఈ సభలో తాను గౌరవం కోల్పోయానని, తన ఆత్మ గౌరవం దెబ్బతిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా, సభా నాయకుడిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ నాడు ఎన్టీఆర్ ఆ సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన సవాల్ ను నిలబెట్టుకున్నారు. ఇక, జయలలిత విషయానికొస్తే... 1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత నాటి సీఎం కరుణానిధిపై అసెంబ్లీలో విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వమంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే ఎమ్మెల్యేలు జయలలితపై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా, దాడికి తెగబడ్డారు. ఆమె చీరను పట్టుకుని ఈడ్చారు. ఈ సంఘటనతో కన్నీటి పర్యంతమైన జయలలిత నాటి సభను బహిష్కరించి వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి వస్తానని శపథం పట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జయలలిత సీఎంగానే తమిళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికారపక్ష సభ్యుల తీరుతో నాడు మనస్తాపం చెందిన ఆ ఇద్దరు నేతలు ఆ తర్వాత అధికారంలోకి రావడం గమనార్హం.