: త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తారు: రఘువీరా రెడ్డి
త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. గుంటూరులో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుపొందిందని వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై రఘువీరా రెడ్డి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోన్నా.. కేసీఆర్‌ను చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం లేదని విమర్శించారు. కేసీఆర్ కేసులు పెడతాడనే భయంతోనే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటి వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు.