: తైవాన్‌కు తొలి మహిళా ప్రెసిడెంట్... ప్రమాణ స్వీకారం చేసిన సాయ్ ఇంగ్ వెన్
తైవాన్‌లో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవిని చేబట్టారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) లో కీలక భూమిక పోషిస్తోన్న సాయ్ ఇంగ్ వెన్ ఈరోజు ఉదయం తైవాన్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. చూడడానికి బిడియంగా కనిపించే సాయ్ ఇంగ్ వెన్ లో ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, సమర్థవంతంగా నాయకత్వం వహించగలిగే ప్రతిభ మెండుగా ఉన్నాయి. తమ దేశాన్ని వేర్పాటు ప్రాంతంగా పరిగణిస్తోన్న చైనాతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించే నాయకురాలు ఎంపికయిదంటూ అంతర్జాతీయ పత్రికలు ఆమెను కీర్తిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా సాయ్ ఇంగ్ వెన్ మాట్లాడుతూ, చైనాతో సత్సంబంధాలు ఏర్పరచేందుకు కృషి చేస్తానన్నారు. బీజింగ్ తమ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరారు. చైనాతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, తైవాన్ ఆర్థిక వ్యవస్థను బలపర్చడం ఆమె ముందున్న సవాళ్లు.