: కరుణానిధి ఆశలపై నీళ్లు చల్లిన వైగో... నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
తమిళనాడులో ఎండీఎంకే అధినేత వై.గోపాలస్వామి నాయుడు (వైగో) చక్రం తిప్పడంతోనే ఈ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఏడాది క్రితమే వామపక్షాలు, దళిత సామాజిక వర్గ పార్టీలతో కలిసి ప్రజా సంక్షేమ కూటమిని వైగో ఏర్పాటు చేశారు. ఈ కూటమిని ఏర్పాటు చేయడమే కరుణానిధిని దెబ్బతీసింది. విశేషం ఏమిటంటే, గతంలో కరుణానిధి పలుసార్లు పన్నిన వ్యూహాలనే ఈసారి వైగో పన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ, తమ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు కరుణానిధి వ్యూహ రచన చేస్తుండేవారు. అధికార పార్టీపై అక్కసుతో ఉన్న పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి బలమైన కూటమిని ఏర్పాటు చేసేవారు. కాగా, ఇదే వ్యూహరచనను వైగో అనుసరించడంతో డీఎంకే పరాజయం పాలైంది. అదేకనుక, ప్రజా సంక్షేమ కూటమిలోని డీఎండీకే లేదా ఏ రెండు పార్టీలైనా డీఎంకేతో కలిస్తే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, డీఎంకే పరాజయం పాలవడంతో ఆ పార్టీ అధినేత కరుణానిధిపై వైగో రాజకీయ విజయం సాధించారనే వార్తలు వినవస్తున్నాయి. ఎందుకంటే, డీఎంకేలో విద్యార్థినాయకుడిగా వైగో చేరారు. ఆ పార్టీలో వైగో ఎదుగుదలను చూడలేని కరుణానిధి ఆయనపై పలు కారణాలు చూపి 1993లో డీఎంకే నుంచి బహిష్కరించారు. దీంతో, డీఎంకేనే చీల్చుతూ ఎండీఎంకే పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు. డీఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టేందుకు కరుణానిధి చేసిన వ్యూహాలను దగ్గరుండి మరీ చూసిన వైగో, అదే అస్త్రాన్ని ఈ ఎన్నికల్లో ప్రయోగించి డీఎంకే చావుదెబ్బ తినేలా చేయడం గమనార్హం.