: చంద్రబాబు నోట మరోమారు ‘సాక్షి’ ప్రస్తావన!... జగన్ పత్రిక స్వాధీనం తప్పదని ప్రకటన
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ప్రస్తావన మరోమారు వినిపించింది. ఇప్పటికే పలుమార్లు ఆ పత్రిక పేరు బహిరంగ వేదికలపై ప్రస్తావించిన చంద్రబాబు... అవినీతి సొమ్ముతో ఏర్పాటైన ఆ పత్రికను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై చంద్రబాబు మరోమారు ‘సాక్షి’ ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యమిస్తోందని ఆయన మండిపడ్డారు. అవినీతి ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు, అవినీతి సొమ్ముతో ప్రారంభమైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వపరమవుతుందని చంద్రబాబు చెప్పారు.