: బాసర అమ్మవారి గుడిపై పిడుగు...కూలిన మూడు శిల్పాలు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి దేవాలయంపై పిడుగుపడింది. ఆలయ తూర్పు ద్వారం (రాజద్వారం)పై బుధవారం సాయంత్రం పిడుగుపడింది. పిడుగు తీవ్రతకు తూర్పు రాజద్వారానికి పగుళ్లు వచ్చాయి. దీంతో గోపురంపై ఉన్న మూడు శిల్పాలు కిందపడిపోయాయి. అయితే, భక్తులెవరూ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ నేపథ్యంలో సంఘటనాస్థలిని ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ శరత్ పాఠక్ పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు చేపట్టనున్నామని వారు తెలిపారు. మెరుపుకాంతితో దూసుకొచ్చిన పిడుగు నేరుగా ఆలయ తూర్పు ముఖద్వారాన్ని తాకడంతో అది రెండు విభాగాలుగా చీలినట్లు తెలుస్తోంది.