: ముట్టుకోకుండానే దెబ్బ కొడుతున్న ఈడీ!... బెంబేలెత్తిపోతున్న అండర్ వరల్డ్ డాన్!
1993లో ముంబైలో మారణహోమం సృష్టించి పాక్ పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేయని యత్నం లేదు. అయితే ఎప్పటికప్పుడు అతడికి పూర్తి స్థాయిలో వత్తాసు పలుకుతున్న పాకిస్థాన్... కరాచీలో స్వేచ్ఛగా తిరుగుతున్న దావూద్ తన దేశంలోనే లేడని వాదిస్తోంది. ఇలాగైతే కుదరదని భావించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతడిని దెబ్బకొట్టేందుకు సరికొత్త మార్గం ఎంచుకుంది. ఇందులో భాగంగా అతడిని ముట్టుకోకుండానే దెబ్బలేసేందుకు కార్యరంగంలోకి దిగింది. ఇందులో భాగంగా అతడి ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన ఈడీ... వాటిని స్తంభింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ దేశాల్లో దావూద్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ... వాటిని స్తంభింపజేస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత కింద ఆరు దేశాలకు లెటర్ రొగేటరీలను రాసిన ఈడీ... ఆయా దేశాల్లోని దావూద్ ఆస్తులను స్తంభింపజేయాలని కోరింది. దౌత్య సంబంధాల నేపథ్యంలో భారత్ రాసిన ఈ లెటర్లకు ఆయా దేశాలు సానుకూలంగా స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. వెరసి ఆయా దేశాల్లో దావూద్ కూడబెట్టిన ఆస్తులు అతడికి దక్కకుండాపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే దావూద్ నెలకొల్పిన నేర సామ్రాజ్యం ఛిన్నాభిన్నం కావడం ఖాయమే. భారత్ రాసిన లేఖల విషయం తెలుసుకున్న దావూద్ బెంబేలెత్తిపోతున్నాడని వార్త కథనాలు వెలువడుతున్నాయి.