: తమిళనాడు, కేరళలను ముంచెత్తిన వర్షం!
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొన్న ఓ వైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే... వరుణ దేవుడు విరుచుకుపడ్డాడు. వర్షంతో ఎక్కడ పోలింగ్ శాతం తగ్గుతుందోనని ఆయా రాజకీయ పార్టీలు ఆందోళనలకు గురయ్యాయి. అయితే ఎన్నికల వేళ అంతగా కురవని వరుణుడు... ఎన్నికలు ముగియగానే తన ప్రతాపం చూపాడు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని కడలూరు తదితర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సంబంధించి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా తమిళనాడు, కేరళలతో పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నిన్న ఏర్పడ్డ వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే వర్షం తీవ్రత మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదన్న ఆ శాఖ హెచ్చరికలతో తమిళనాడు, కేరళలోని అన్ని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.