: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహిళ నుంచి రూ.10 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ వద్ద రెండు కిలోల కొకైన్ ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక మహిళ వద్ద సుమారు రూ.10 కోట్లు విలువ చేసే కొకైన్ ను పట్టుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎమిరేట్స్ విమానంలో సదరు మహిళ మాదక ద్రవ్యాలను భారీగా తీసుకువస్తున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. దీంతో తాము అప్రమత్తమయ్యామని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. నిందిత మహిళ వద్ద ఉన్న ఐదు పుస్తకాలకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ కవర్లు ఉండటంతో, వాటిని విప్పి చూశామని అన్నారు. దీంతో, పుస్తకాలలోని పేజీల మధ్య పెట్టి కొకైన్ తీసుకువస్తున్నట్లు ఆమె అంగీకరించిందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.