: మోదీపై రషీద్ అల్వీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
‘మోస్ట్ స్టుపిడ్ పీఎం’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ అల్వీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలపట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలో మోదీ రెండేళ్ల పాలనపై రషీద్ అల్వీ మాట్లాడుతూ.. మోదీ మోస్ట్ స్టుపిడ్ ప్రధాని అని, ఈ విషయం గూగుల్ సెర్చ్లో తేలిందని అన్నారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని రషీద్ అల్వీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రశ్నించారు. రషీద్ అల్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ నాయకులు మోదీపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తాము మోదీని గురించి మాట్లాడేటప్పుడు తమ పరిధిని గుర్తు తెచ్చుకోవాలని స్మృతి ఇరానీ సూచించారు. పలువురు బీజేపీ నేతలు కూడా రషీద్ అల్వీ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.