: హరీష్ వ్యాఖ్యలపై కేఈ ఫైర్!... తరిమికొడతామంటూ వ్యాఖ్యానించడమేమిటని ఆగ్రహం
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జల దీక్షపై తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేఈ... హరీశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తరిమికొడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంత్రి హోదాలో ఉన్న నేతలు చేయాల్సినవి కావని ఈ సందర్భంగా కేఈ అన్నారు. అయినా ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఎక్కడున్నాయో, ఎప్పుడు వచ్చాయో చూపాలని కూడా కేఈ డిమాండ్ చేశారు. ఇక జల వివాదాలకు ఆద్యుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆరోపించిన కేఈ... రాయలసీమ ఎడారిగా మారుతుందని వైఎస్ జగన్ నిత్యం చెప్పడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు.