: ‘హోదా’ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం!... మంత్రి పదవికి రాజీనామాకు వెనుకాడేది లేదన్న అశోక్ గజపతిరాజు!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తేల్చిచెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ నేపథ్యంలో నిన్న విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశానికి అశోక్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వస్తేనే... బీజేపీ సర్కారుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందన్న విపక్షం, ప్రజా సంఘాల వాదనలను గుర్తు చేసిన అశోక్... కేంద్ర మంత్రి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు సహా సమావేశానికి హాజరైన వారంతా ఆయనను వారించారు. ‘‘విపక్షాలు లక్ష చెబుతాయి. కానీ, రాష్ట్రానికి ఏది మంచిదో మనమే చూసుకోవాలి. కేబినెట్ లో ఉంటే ఒత్తిడి కొనసాగించడానికి, రాష్ట్రానికి మరిన్ని తెచ్చుకోవడానికి వీలవుతుంది. తెగదెంపుల వల్ల ప్రయోజనమేమీ ఉండదు’’ అని ఆయనను పార్టీ నేతలు వారించారు.