: మా ఆయనకు పదవి ఇచ్చేది లేదు: హిల్లరీ క్లింటన్
డెమోక్రాట్ల తరఫున యూఎస్ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి నామినేట్ అవుతారని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు తన మంత్రివర్గంలో ఎటువంటి స్థానమూ దక్కదని ఆమె స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతుండగా, అధికారంలోకి వస్తే బిల్ కు క్యాబినెట్ లో చోటిస్తారా? అన్న ప్రశ్న ఎదురుకాగా, హిల్లరీ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు చోటుండదని ఆమె వెల్లడించడం గమనార్హం. సరిగ్గా 24 గంటల క్రితం, తన భర్తకు ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలో బాగా తెలుసంటూ హిల్లరీ వ్యాఖ్యానించగా, ఆయనకు ఆర్థిక శాఖ దక్కవచ్చన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆపై ఒక్క రోజు గడవకుండానే బిల్ క్లింటన్ కు పదవి ఇచ్చేదిలేదని ఆమె పేర్కొనడం గమనార్హం.