: బీజేపీ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా!... టీడీపీపై విమర్శల కోసమే ‘కమలం’ ఎమ్మెల్సీ గిమ్మిక్కు!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం... మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించిందని చెప్పాలి. హోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ వాదిస్తుండగా... హోదా కంటే ఎక్కువ సాయమే చేస్తుండగా, ఇంకా ప్రత్యేక హోదా ఎందుకంటూ బీజేపీ నేతలు ప్రతి వాదన చేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన రెండేళ్లలో ఏపీకి కేంద్రం చేసిన సాయంపై ఇరు పార్టీల నేతలు రెండు రకాల లెక్కలు చెబుతున్నారు. వాద ప్రతివాదనల్లో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలో మిత్రపక్షం టీడీపీపై పెను విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు... దానిని మరింతగా తూలనాడేందుకు ఏకంగా బీజేపీ పేరిట ఓ నకిలీ ఫేస్ బుక్ ఖాతానే తెరిచారు. ఈ ఫేస్ బుక్ పేజీలో టీడీపీపై ఘాటు వ్యాఖ్యలతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాకా వెళ్లింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి... సదరు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టి నిజమే అయితే, అందుకు బాధ్యులైన వారిపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసేలా ఫిర్యాదు కూడా చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నకిలీ ఖాతా ఓపెన్ కాకముందు సదరు ఎమ్మెల్సీ టీడీపీపై విరుచుకుపడిన తీరు కూడా వెలుగుచూసింది. గడచిన ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏపీ శాఖలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు టీడీపీ అంటే అస్సలు పడదు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలపై ప్రచారం కల్పించేందుకు బీజేపీ ఏపీ శాఖకు సంబంధించి ‘బీజేపీ- ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ’ పేరిట ఓ ఫేస్ బుక్ ఖాతా ఉంది. ఈ ఖాతాలో టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ సదరు ఎమ్మెల్సీ పోస్టులు అప్ లోడ్ చేసేవారు. దీనిని గమనించిన పార్టీ ఐటీ సెల్ ఇన్ చార్జీ అమిత్ మాలవీయ... మొదట్లో కాస్తంత ఓపిక పట్టినా, విమర్శల్లో ఘాటు పెరగడంతో ఎమ్మెల్సీని వారించారు. దీంతో భగ్గుమన్న సదరు ఎమ్మెల్సీ మాలవీయపై అంతెత్తున ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో పార్టీ ఫేస్ బుక్ ఖాతా అయితే సరిపోదని భావించిన ఎమ్మెల్సీ... ‘ఆంధ్రా బీజేపీ- పొలిటికల్ ఆర్గనైజేషన్’ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. ఈ చర్య ఆ ఎమ్మెల్సీని దాదాపుగా చిక్కుల్లో పడేసినట్లేనన్న వాదన వినిపిస్తోంది.