: ‘భజరంగీ భాయ్ జాన్’ డైరెక్టర్ కు అత్యవసర ఆపరేషన్!
‘భజరంగీ భాయ్ జాన్’ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆయనకు అత్యవసర ఆపరేషన్ చేశారు. ఈ నెల 13న తీవ్ర కడుపునొప్పితో కబీర్ ఖాన్ బాధపడటంతో ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రికి తరలించారు. ఆయన కడుపులో రాళ్లు (స్టోన్స్) ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వాటిని తొలగించే నిమిత్తం అత్యవసర ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ నిర్వహించిన మర్నాడే కబీర్ ఖాన్ ను డిశ్చార్జి చేసినట్లు సమాచారం. కాగా, ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’, ‘ఫాంథమ్’ ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కబీర్ ఖాన్ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.