: కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారు: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించేలా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలులో ప్రారంభించిన దీక్షలో జగన్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ ప్రజల బతుకులు బుగ్గిపాలు అవుతాయని ఆయన అన్నారు. వీటిపై కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లలో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉందని కేసీఆర్ వాదిస్తున్నారని, కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడడం భావ్యం కాదని జగన్ అన్నారు. కేసీఆర్ ఇష్టా రాజ్యంగా ప్రాజెక్టులు కడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ రాష్ట్రం వాటా ఎంతనేది ఇంతవరకూ తేలనేలేదని జగన్ అన్నారు. కేసీఆర్ కి జ్ఞానోదయం రావాలని జగన్ వ్యాఖ్యానించారు. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయనే రీతిలో కేసీఆర్ ప్రవర్తన ఉందని ఆయన అన్నారు. ‘నీళ్లు లేకపోతే మేమెలా బతుకుతా’మని ఆయన ప్రశ్నించారు. ‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరును ఎదిరించేందుకు మనమంతా ఏకమవుదా’మని జగన్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.