: సినీ అభిమానుల మెదళ్లకు మేత పెట్టిన నయనతార...పెళ్లి చేసుకుందా?
సినీ నటి నయనతార అభిమానుల మెదళ్లకు మేత పెట్టింది. దీంతో నయనతార పెళ్లి చేసుకుందా? అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమాయణాలు నడపడంలో నయనతార స్టైలే వేరు. శింబు, ప్రభుదేవా, ఆర్య, గణేష్ ఇలా పలువురితో ప్రేమాయణాలు నడిపిన నయనతార తాజాగా 'బాబుబంగారం' సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ లో ఉన్న ఈ సినిమా యూనిట్ సభ్యులు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత నాగ వంశీ, దర్శకుడు మారుతి కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేయగా, అందులో ఈ నలుగురు కూర్చుని ఉండగా, వెనక నుంచి తీశారు. నాగవంశీ చైర్ మీద ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్ మీద డైరెక్టర్ అని, వెంకీ చైర్ మీద మిస్టర్ వెంకటేష్ అని, నయనతార చైర్ మీద మాత్రం మిసెస్ కురియన్ అని రాసి ఉంది. దీంతో నయనతార ఎప్పుడు పెళ్లి చేసుకుందన్న అనుమానం అందర్లోనూ నెలకొంది. అయితే నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ కాగా, సినిమాల కోసం నయనతారగా మార్చుకుంది. అయితే ఆమె పేరుకు ముందు మిసెస్ అని రాయడంతో నయనతార గుట్టుగా వివాహం చేసుకుందా? అనే అనుమానం కలుగుతోంది. లేక సినిమాలో వెంకటేష్ ను వివాహం చేసుకోవడం వల్ల ఇలా రాశారా? అని అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.