: నిద్రలో కాలు తగిలిందేమో... నాకే పాపమూ తెలియదు: విమానంలో మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్న విజయవాడ కార్పొరేటర్


విమానంలో ఓ మహిళను వేధించాడన్న ఆరోపణలపై పోలీసు కేసులో ఇరుక్కున్న విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, తనకే పాపమూ తెలియదని చెప్పారు. ఈ ఉదయం ఓ టెలివిజన్ చానల్ తో మాట్లాడిన ఆయన, విమానం ఎక్కగానే నిద్రలోకి జారుకున్నానని, నిద్రలో తన కాలు తగిలిందేమో తెలియదని, ఆపై పావుగంటకు స్టీవార్డ్ వచ్చి తనకు వేరే సీటు చూపిస్తే, అక్కడ కూర్చున్నానని తెలిపారు. విషయం తెలిస్తే, తాను ఆ మహిళకు అక్కడే క్షమాపణలు చెప్పి వుండేవాడినని అన్నారు. తాను మహిళలను అక్కా చెల్లెళ్లుగా భావిస్తానని, మచ్చలేని రాజకీయ జీవితం గడుపుతున్నానని వివరించారు. కాగా, హైదరాబాద్, గన్నవరం విమానాశ్రయాల్లో పోలీసులకు చిక్కకుండా ఈయన తప్పించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇటు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్లో, అటు గన్నవరం స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో దోషిగా తేలితే ఆయనకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుందని న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News