: సైకిల్ దొంగ నుంచి సూపర్ రిచ్ బిజినెస్ మ్యాన్ గా... ఇప్పుడు హంతకుడికి తండ్రి... బీహార్ క్రైం కహానీ!


బీహార్ ఎమ్మెల్సీ మనోరమా దేవి... ఆమె కుమారుడు రాకీ యాదవ్! ఇప్పుడీ ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో ఓ టీనేజ్ కుర్రాడిని తుపాకితో కాల్చి చంపిన రాకీ, కొడుకును దాచడంతో పాటు ఇంట్లో మద్యం బాటిళ్లు దాచినందుకు కేసులను ఎదుర్కొంటూ పదవికి దూరమైన మనోరమ నిత్యమూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. మరి రాకీ తండ్రి గురించి... మనోరమా దేవి భర్త బిందేశ్వరీ ప్రసాద్ యాదవ్ అలియాస్ బిందీ యాదవ్ గురించి మీకు తెలుసా? అన్నట్టు మరో కేసులో ఈయన ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు లెండి. ఇక ఆయన జీవితంలోకి ఓసారి తొంగి చూస్తే, ఇప్పుడో పెద్ద కోటీశ్వరుడైనప్పటికీ, మూడున్నర దశాబ్దాల క్రితం అతనో సైకిళ్ల దొంగట. ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి. 1990 దశకంలో బచువా అనే మరో రౌడీతో కలిసి ఎన్నో నేరాల్లో పాల్గొన్నాడు. వీరిద్దరినీ స్థానికులు బిందియా-బచువా జోడీగా పిలిచేవారు. వీరి దారికి అడ్డెళ్లేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. గయ పట్టణంలో జరిగిన ఎన్నో భూదందాల్లో వీరి ప్రమేయం ఉంది. వారి చేతుల్లోని తుపాకులు మాత్రమే మాట్లాడుతుండేవి. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్న సమయాన నేరగాళ్లు, సురేంద్ర యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేశ్వర్ యాదవ్ ల హవా సాగుతుండగా, వీరిద్దరూ కూడా అదే గ్యాంగులో చేరిపోయారు. వారి క్రూరత్వాన్ని అడ్డుకోవాలని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, తనకు రాజకీయ అండ ఉండాలని భావించిన బిందీ, 1998 ప్రాంతంలో ఆర్జేడీలో చేరి, 2001లో గయ జిల్లా పరిషత్ చైర్మన్ గా అవతరించాడు. 2005లో స్వతంత్ర అభ్యర్థిగా, 2010లో ఆర్జేడీ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ పడి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఇతనిపై 18 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, జేడీయూలో చేరిపోయాడు. ఆపై 2001లో ఏకే -47 తుపాకిని, రైఫిల్ ను, 4 వేల కార్ట్రిడ్జ్ లను కలిగివున్నందుకు అరెస్టై జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తరువాత హోటళ్లు, పెట్రోలు బంకుల వ్యాపారాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే కోట్లకు కోట్లు కూడబెట్టాడు. గయ, బోధ్ గయ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో బిందీకి మాల్స్, హోటళ్లు, 15 పెట్రోలు బంకులు ఉన్నాయి. రహదార్ల నిర్మాణం నుంచి మద్యం వ్యాపారం వరకూ ఎన్నింటిలోనో బిందీ విస్తరించాడు. ఇంత 'ఘనమైన' చరిత్ర ఉన్న బిందీ, తన కుమారుడికి రూ. 1.5 కోట్ల విలువైన కారును కొనిచ్చాడంటే ఆశ్చర్యమేముంది? దీంతో పాటు ఇటలీలో తయారైన .32 బోర్ ఫిస్టల్ ను, గన్ లైసెన్స్ నూ ఇప్పించాడు కూడా. ఇక తన నేరచరిత్రతో నేరుగా పోటీ పడలేక, తన భార్యకు ఎమ్మెల్సీ వచ్చేలా చేసుకున్నాడు. పేరుకే భార్యది అధికారమైనా, నిర్ణయాలన్నీ బిందీవే అంటే నమ్మని వారెవరు? ఇక రాకీ యాదవ్ ఘటన తరువాతైనా బీహార్ సర్కారు కదులుతుందా? లేక అందరూ చెప్పే 'జంగిల్ రాజ్' ఇలాగే కొనసాగుతుందా వేచి చూడాలి.

  • Loading...

More Telugu News