: రమణానంద మహర్షి సభా స్థలికి దూసుకొచ్చిన పంపాక్షేత్ర పీఠాధిపతి... సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావంటూ మండిపాటు!
షిర్డీ సాయిబాబా దేవుడని నిరూపిస్తానంటూ సిద్ధగురు రమణానందమహర్షి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అకస్మాత్తుగా ఈ సభా స్థలి వద్దకు కారులో వచ్చిన పంపాక్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి, రమణానంద మహర్షిపై మండిపడ్డారు. ఇక్కడి సభా వేదికపై షిర్డి సాయిబాబా విగ్రహం పక్కన, ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని పెట్టడం సబబు కాదని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధంగా రమణానంద మహర్షి ప్రవర్తిస్తున్నారంటూ గోవిందానంద ఊగిపోయారు. సాయిబాబా దేవుడు కాదనేవారు తనతో వాదనకు రావాలంటున్న రమణానంద మహర్షి ఆ మాటపై నిలబడటం లేదన్నారు. రమణానంద మహర్షితో వాదనకు తాను సిద్ధంగా ఉన్నానని.. వాదనకు దిగాలంటూ గోవిందానంద పట్టుబట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆయనకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఈ తతంగం సుమారు గంటపాటు జరిగింది. కాగా, గోవిందానంద ఆరోపణలపై రమణానంద మహర్షి మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఇక్కడ వాదోపవాదనలకు ఆస్కారం లేదని అన్నారు.