: కృష్ణపట్నం పోర్టులో కోట్ల విలువైన ఆయిల్ దోచేశారు...13 మంది అరెస్టు!
ఐదు నెలలుగా జరుగుతున్న దందాకు నెల్లూరు పోలీసులు చెక్ పెట్టారు. కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో వెలుగు చూసిన దందా గురించి తెలుసుకున్న ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. కృష్ణపట్నం పోర్టులో షిప్పుల ద్వారా దిగుమతి అయిన ఆయిల్ పైప్ లైన్ కి ప్రత్యేక పరికరాల ద్వారా రంధ్రం చేసి, వాల్వ్ బిగించి, ఆయిల్ ను దారిమళ్లించారు. అక్కడి పొలాల్లో ఓ షెడ్డును నిర్మించి, దాని వెనుక ట్యాంకర్లను పెట్టి ఆయిల్ నింపేవారు. ఒక ట్యాంకర్ నింపేందుకు పట్టే సమయం గంటన్నర అని పోలీసులు తెలిపారు. ఇలా నింపిన మూడు కోట్ల రూపాయల విలువ కలిగిన 5 ట్యాంకర్ల పామాయిల్, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 13 మందిని అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీని వెనుక ఎలాంటి మాఫియా హస్తం లేదని పోలీసులు ప్రకటించారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ఆయిల్ సరఫరా అవుతున్నప్పుడు పైప్ లైన్ కు ప్రత్యేక పరికరాల ద్వారా రంధ్రం చేయడం ఎలా సాధ్యం? అన్న విషయం అంతు చిక్కడం లేదు. అదే సమయంలో ఐదు నెలలుగా ఇంత పెద్ద దందా జరుగుతున్నప్పుడు బయటకు రాకుండా సాధ్యమా? అన్న అనుమానాలు సమాధానాలు లేని ప్రశ్నల్లా మిగిలిపోయాయి.