: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ చేస్తే బదులివ్వని '100'... పోలీసు కమిషనర్ కూడా!
తాను కొంత ఇబ్బందిలో ఉన్నానని చెప్పేందుకు ఓ న్యాయమూర్తి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 100కు ఫోన్ చేశారు. అవతలి నుంచి రెస్పాన్స్ రాలేదు. కాసేపటికి పోలీసు కమిషనర్ కు కూడా విషయం చెప్పాలని చూశారు. ఆయనా స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని కోర్టుకు ఓ లేఖ రూపంలో చెప్పగా, దాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విపిన్ సంఘి, గత నెల 29న ఓ వివాహానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వసంత్ కుంజ్ సమీపంలో విపరీతమైన ట్రాఫిక్ జాంలో ఆయన కారు చిక్కుకుపోయింది. పరిస్థితిని చక్కబెట్టేలా, చుట్టూ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామన్న విషయం తెలియని ఆయన, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు 100కు డయల్ చేశారు. ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఆఫై ఢిల్లీ పోలీసు కమిషనర్ కు ఫోన్ చేయగా ఆయనా ఎత్తలేదు. "నేను మీ ఫోన్ కు రాత్రి 10:27 నుంచి 10:30 గంటల సమయంలో పలుమార్లు కాల్ చేశాను. దురదృష్టవశాత్తూ నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు" అని కమిషనర్ కు లేఖను రాస్తూ, దాని కాపీని హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణికి పంపారు. న్యాయమూర్తి లేఖను సుమోటోగా తీసుకున్న రోహిణి కేసును విచారించాలని నిర్ణయించి నోటీసులు పంపారు.