: ‘ఎర్ర’ డాన్ సంగీతా చటర్జీ నెట్ వర్క్ చాలా పెద్దదే!... విలాసవంతమైన జీవనశైలి!
ఎర్రచందనం అక్రమ తరలింపునకు చెక్ పెట్టేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రెడ్’లో భాగంగా కోల్ కతాలో అరెస్టైన మహిళా డాన్ సంగీతా చటర్జీ నెట్ వర్క్ చాలా పెద్దదేనట. ఆమె విలాసవంతమైన జీవితం, పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించిన చిత్తూరు పోలీసులు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకెళితే... ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగిన లక్ష్మణ్ కు సంగీతా చటర్జీ రెండో భార్యగా మారింది. అంతకుముందు ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీతాకు పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లక్ష్మణన్ ను వివాహం చేసుకుంది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సంగీతా... మోడల్ గానూ రాణించిందట. ఇందులో భాగంగా ఆమె పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ సంగీతా... నిత్యం బార్లు, పబ్బు, క్లబ్బుల వెంట ఖరీదైన కార్లలో తిరిగేదట. ఇక 2014లో లక్ష్మణ్ అరెస్ట్ కావడంతో భర్త నిర్వహిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా బాధ్యతలను కూడా సంగీతా తన భుజాన వేసుకుంది. ఈ క్రమంలో దేశంలోని పలు నగరాల్లోని స్మగ్లర్లే కాక అంతర్జాతీయ స్మగ్లర్లతోనూ ఆమె సంబంధాలు నెరపారు. విదేశాల నుంచి హవాలా రూపంలోనూ డబ్బు తెప్పించడంలోనూ సంగీతా ఆరితేరిపోయారు. ఇలా తెచ్చిన మొత్తాన్ని దేశంలోని పలువురు స్మగ్లర్లకు ఆమె అందజేశారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ స్మగ్లర్ మోజెస్ ద్వారానే ఆమె రూ.10 కోట్ల మేర చెల్లింపులు జరిపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆమెకు చెందిన సమగ్ర వివరాలు సేకరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తన సిబ్బందిని కోల్ కతా పంపించారు. అక్కడికి వెళ్లిన చిత్తూరు పోలీసులు సంగీతాను అరెస్ట్ చేశారు. కోల్ కతా నుంచి సంగీతాను చిత్తూరు తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయగా కొన్ని ఇబ్బందులతో అది కుదరలేదు. దీంతో కోల్ కతా కోర్టులోనే ఆమె అరెస్ట్ ను చూపగా, తన పలుకుబడిని వినియోగించుకుని సంగీతా కేవలం ఒక్క రోజులోనే బెయిల్ తెచ్చుకుంది. అయితే ఏదేమైనా సంగీతాను చిత్తూరుకు తీసుకురావాల్సిందేనని పోలీసులు అక్కడే తిష్ట వేశారు. అరెస్ట్ సందర్భంగా సంగీతాకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లు, పాస్ పోర్టు, ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ కీ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నెల 18లోగా ఎలాగైనా సంగీతాను చిత్తూరు తీసుకువచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. చిత్తూరులోని నాలుగు పోలీస్ స్టేషన్లలో సంగీతాపై కేసులు నమోదయ్యాయి.