: మోదీ, పవన్ కల్యాణ్ లేకుంటే... మీకు అధికారం దక్కేదా?: టీడీపీపై బీజేపీ ధ్వజం
ఏపీలో అధికార పార్టీ టీడీపీపై ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిన్న హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య తదితరులు టీడీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు. అసలు తమతో పొత్తు పెట్టుకోమని తామెవరినీ పిలవలేదని ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి కాస్తంత వ్యంగ్యం ప్రదర్శించారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు లేకుంటే... టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదని కూడా ఆయన తేల్చేశారు. ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘‘ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించగానే ఆయనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులే పొత్తు కోసం మా వెంటపడ్డారు. మోదీ ఇమేజ్, పవన్ కల్యాణ్ మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరు పొమ్మంటున్నారు? వాజ్ పేయి ప్రధానిగా ఉండగా మిత్రధర్మాన్ని పాటించి రాష్ట్రంలో, కేంద్రంలో మధ్యంతర ఎన్నికలకు బీజేపీ వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీ కారణంగానే అధికారం కోల్పోయామని మాపై నిందలు వేసి టీడీపీ తప్పుకుంది. పదేళ్లు దూరంగా ఉండి దేశవ్యాప్తంగా మోదీకి పెరుగుతున్న ఆదరణను చూసి తగుదునమ్మా అంటూ వచ్చి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు’’ అంటూ సురేశ్ రెడ్డి టీడీపీపై దుమ్మెత్తిపోశారు.