: ‘హోదా’ కోసం ఒక్కటి కానున్న కాంగ్రెస్, టీడీపీ!... కేవీపీ బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం


ఏపీ రాజకీయాల్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. ఈ నెల 13న కనిపించనున్న ఈ అరుదైన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికే తెర లేపనుందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం నుంచి ఆశించిన మేర సాయమందడం లేదని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కూడా ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే పలుమార్లు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు విన్నవించారు. అయితే చంద్రబాబు వినతిని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలు విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు తెర తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కేవీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు టీడీపీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఈ నెల 13న జరగనున్న ఓటింగ్ లో బిల్లుకు మద్దతు పలకాలని చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు చెప్పారు. ఇటీవల జరిగిన టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఈ బిల్లు ప్రస్తావనకు రాగా... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లుకు మద్దతుగా అనుకూలంగా ఓటేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే... ఆగర్భ శత్రువులుగా కొనసాగుతూ వస్తున్న రెండు పార్టీలు రాష్ట్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చినట్లవుతుంది. మరి కాంగ్రెస్ సభ్యుడి బిల్లుకు టీడీపీ మద్దతిస్తే... ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News