: బాబు వచ్చారు, జాబు రాలేదు.. ప్రజలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారు: వైఎస్ జగన్
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక ప్రజలకు పంగనామాలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహిస్తోన్న ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చంద్రబాబు వెన్ను పోటు వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని జగన్ వ్యాఖ్యానించారు.