: విశ్వాస పరీక్షలో గెలిచిన హరీశ్ రావత్!... షాక్ తిన్న బీజేపీ?
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర సీఎం హరీశ్ రావత్ కేంద్రంలో అధికారంలోని బీజేపీకి షాకిచ్చినట్టే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన విశ్వాస పరీక్షలో హరాశ్ రావత్ విజయం సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్ కు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా... తీర్మానానికి వ్యతిరేకంగా 28 ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ఫిరాయింపులతో దాదాపుగా అధికారం కోల్పోయిన రావత్ సత్తా చాటారన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ పక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకుని సత్తా చాటిన రావత్... బీఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతులో మ్యాజిక్ ఫిగర్ 31 కంటే అధికంగానే ఓట్లను సాధించినట్లు సమాచారం. ఈ మేరకు బల పరీక్ష ముగియగానే బయటకు వచ్చిన రావత్ వర్గం విజయ దరహాసం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారు తమ విజయంపై నోరు విప్పకున్నా, విజయానందం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాక గెలుపు తమదేనన్న రీతిలో రావత్ వర్గమంతా ధీమాగా కార్లెక్కేసింది. వెరసి పార్టీ ఫిరాయింపులతో ఓడిపోయిన రావత్... బల పరీక్షలో విజయం సాధించినట్లైందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.