: అమరావతి కార్మికుల ఆగ్రహానికి బూడిదైన అంబులెన్స్... బద్దలైన ఎల్ అండ్ టీ కార్యాలయం
సాటి కార్మికుడు కళ్ల ముందే కాంక్రీట్ మిల్లర్ లో పడిపోయి ప్రాణాలు వదిలిన ఘటన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కార్మికులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో భాగంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకున్న ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన దేవేందర్ అనే కార్మికుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన కార్మికులు అక్కడ ఆందోళనకు దిగారు. బాధితుడి కుటుంబానికి ఎలాంటి పరిహారం ప్రకటించకుండానే మృతదేహాన్ని తరలించేందుకు యత్నించిన పోలీసుల చర్య వారిని మరింత ఆగ్రహావేశాలకు లోను చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కార్మికుల ఆగ్రహం అక్కడ పెను విధ్వంసాన్నే సృష్టించింది. తమను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్విన కార్మికులు దేవేందర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ ను ఎత్తి కుదేశారు. ఆ తర్వాత దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అప్పటికీ ఆగ్రహం చల్లారని కార్మికులు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లిన కార్మికులు అక్కడి ఫర్నీచర్ పై ప్రతాపం చూపారు. టేబుళ్లు, కుర్చీలను విరగ్గొట్టిన కార్మికులు కంప్యూటర్లను కూడా నేలకేసి కొట్టారు. కార్మికుల దాడిలో ఎల్ అండ్ టీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. కార్యాలయం బయట నిలిపి ఉంచిన ఎల్ అండ్ టీ కార్లపైనా కార్మికులు దాడికి దిగారు. ఒక్కసారిగా పెల్లుబికిన కార్మికుల ఆగ్రహంతో షాక్ తిన్న పోలీసులు కూడా మిన్నకుండి చూడటం మినహా మరేమీ చేయలేకపోయారు.