: ఉత్తరాఖండ్ లో ‘విశ్వాసం’ నెగ్గుతుందా?... అందరి దృష్టి రావత్ బల పరీక్షపైనే!


రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్ లో నేడు కీలక ఘట్టానికి తెర లేచింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ నేడు తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న రావత్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గుతుందా? పార్టీ ఫిరాయింపులతో కుప్పకూలుతుందా? అంటూ దేశం మొత్తం ఆ రాష్ట్రంపై వైపే చూస్తోంది. 70 మంది ఎమ్మెల్యేలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 36 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ సర్కారును ఏర్పాటు చేశారు. అయితే విపక్ష బీజేపీ విసిరిన వలకు కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రావత్ కు హ్యాండిచ్చారు. ఈ నేపథ్యంలో రావత్ సర్కారు బలం 27కు పడిపోయింది. ఈ సంఖ్యతో బల పరీక్షలో రావత్ సర్కారు ఓడటం ఖాయమే. అయితే పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు... జంపింగ్ ఎమ్మెల్యేలకు ఓటు హక్కును నిరాకరించింది. అసలు వారంతా సభలో అడుగుపెట్టేందుకే కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నికరంగా 61 మంది ఎమ్మెల్యేలు నేటి బల పరీక్షకు హాజరుకానున్నారు. 27 మంది సొంత పార్టీ సభ్యుల బలమున్న రావత్ సర్కారుకు... ఇద్దరు సభ్యుల బలమున్న బీఎస్పీ, ఓ యూకేడీ ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు పలికారు. వెరసి రావత్ బలం ప్రస్తుతానికి 33 కు చేరింది. ఈ సభ్యులంతా హరీశ్ రావత్ కు మద్దతు పలికితే బీజేపీకి షాక్ తగలడం ఖాయమే. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేఖా ఆర్యా రావత్ కు అందుబాటులో లేకుండా పోయారు. రేఖా చేజారినా... హరీశ్ బలం 32గా ఉంది. మరి ఈ బలంతో రావత్ విశ్వాస పరీక్ష నెగ్గుతారా? ఫిరాయింపులు మరింత పెరిగి ఓడుతారా? అన్న విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News