: తమిళ ఎన్నికల బరిలో బెజవాడ వాసి!... శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయకృష్ణ
తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ విజయవాడకు చెందిన ఓ కుటుంబం కూడా ఇంటింటి ప్రచారం చేస్తోంది. విజయవాడ కుటుంబం ఏమిటీ?... తమిళనాడులో ప్రచారం చేయడమేమిటనేగా మీ అనుమానం. తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా విజయవాడకు చెందిన వడ్డమన్నాటి విజయకృష్ణ పోటీ చేస్తున్నారు. విజయకృష్ణ గెలుపు కోసం ఆయన తల్లిదండ్రులు, సోదరి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. తెలుగు వారి సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన తన కుమారుడిని గెలిపించాలని ఆయన తల్లి హరిప్రియాదేవి నిన్న విజయవాడ కేంద్రంగా మీడియా సమావేశం పెట్టి మరీ విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని తమ వారికి తెలుగు నేలకు చెందిన వారు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆమె విన్నవించారు. విజయవాడలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయకృష్ణ ప్రస్తుతం చెన్నైలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. సమాజానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు.