: మూడు నెలల్లో రూ. 3 వేలు పెరిగిన బంగారం ధర... అక్షయ తృతీయకు స్పందన అంతంతే!
అక్షయ తృతీయ... బంగారం కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ఒకటి. నేడు అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున బంగారం అమ్మకాలు సాగుతాయని ఉత్సాహంగా ఉన్న ఆభరణాల వ్యపారులపై బంగారం ధర నీళ్లు చల్లింది. బంగారం నూతన కొనుగోళ్లను ప్రోత్సహించేలా ఎన్ని కొత్త ఆఫర్లను దగ్గర చేసినా, కొనుగోళ్లకు పెద్దగా స్పందన లేనట్టు తెలుస్తోంది. మూడు నెలల క్రితం ఫిబ్రవరి తొలి వారంలో రూ. 26,930 వద్ద ఉన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పుడు రూ. 30 వేలకు పైగా ఉండటమే, ప్రజలను కొనుగోళ్లకు దూరం చేస్తోందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. గత సంవత్సరంతో పోలిస్తే ధరలు అధికంగా ఉన్న కారణంగా, వాల్యూములు తగ్గినప్పటికీ, అధిక వ్యాపారం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అధికంగా ఉన్న ధరలు బంగారానికి డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయని, ప్రజలు అక్షయ తృతీయ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని జీజేఎఫ్ మాజీ చైర్మన్ బచ్ రాజ్ బమాల్వా అన్నారు. బంగారం నాణాల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. వివాహాది శుభకార్యాలకు బుకింగ్స్, ఆభరణాల వర్తకందారుల సమ్మె అనంతరం జరిగిపోయాయని, అందువల్ల పెద్ద పెద్ద నగల అమ్మకాలు అక్షయ తృతీయ నాడు జరిగే అవకాశాలు లేవని వివరించారు. బంగారం అధికంగా వినియోగించే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటం కూడా అమ్మకాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రెండు అక్షయ తృతీయ పర్వదినాల్లో బంగారం అమ్మకాలు 15 శాతం వరకూ పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ దఫా మాత్రం అటువంటి వృద్ధి నమోదుకు అవకాశాల్లేవని తెలుస్తోంది.