: సోనియా గాంధీ అల్లుడి రాజకీయ తెరంగేట్రం?... ‘సేవ్ డెమోక్రసీ’ పోస్టర్లలో వాద్రా ఫొటో!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా రాజకీయ తెరంగేట్రంపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతున్నారన్న ప్రచారమూ సాగుతోంది. అయితే ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వస్తారో, రారో తెలియదు కాని... ఆమె భర్త, పలు వివాదాల్లో చిక్కుకున్న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయ తెరంగేట్రానికి మాత్రం రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ లో హరీశ్ రావత్ సర్కారును కూల్చేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను నిరసిస్తూ మొన్న (ఈ నెల 6)న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట చేపట్టిన ఆందోళనలో కనిపించిన ఓ దృశ్యమే ఇందుకు నిదర్శనమని నేషనల్ మీడియా పలు కథనాలను రాసింది. సదరు ఆందోళనలో పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు పాలుపంచుకున్నారు. ఈ ఆందోళనకు హాజరైన పార్టీ కార్యకర్తల చేతిలోని ఓ పోస్టర్ అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆకట్టుకుంది. ఓ పక్క సోనియా గాంధీ, మరోపక్క రాహుల్ గాంధీ ఫొటోలు ఉన్న సదరు పోస్టర్ లో మధ్యన రాబర్ట్ వాద్రా ఫొటో ఉంది. ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వాద్రాకు సంబంధించి ఫొటో పార్టీ వేదికపైనే కాక పార్టీ పోస్టర్లలోనూ ఎక్కడా కనబడ్డ దాఖలా లేదు. ఈ నేపథ్యంలో తొలిసారిగా వాద్రా ఫొటో పార్టీ పోస్టర్లపై కనిపించడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల బీజేపీ సర్కారు వాద్రాను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాద్రా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News