: తల్లులు అతిగా బరువు పెరిగినా...గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా పిల్లలు ఊబకాయులవుతారు
గర్భవతులుగా ఉన్న మహిళలు అతిగా బరువు పెరిగినా లేదా వారిలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా ఆ ప్రభావం కడుపులోని పిల్లలపై పడుతుందని అధ్యయనం తెలిపింది. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో 24 వేల మందికి పైగా తల్లులు, పిల్లలను పరిశీలించారు. 1995-2003 మధ్య జన్మించిన పిల్లలంతా సాధారణ బరువు (2.4-3.9 కేజీల) తో జన్మించినవారే కావడం విశేషం. వీరిని రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు పరిశీలించి, వారి తల్లుల ఆరోగ్యంతో పోల్చిచూశారు. గర్భవతులు ఎక్కువ బరువు పెరిగి వారిలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే వారి పిల్లల్లో స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని గుర్తించినట్టు వారు తెలిపారు. పిల్లల జీవక్రియల్లో మార్పులు చోటుచేసుకుని ఆ ప్రభావంతో వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. గర్భవతులు తీసుకునే అధిక ఆహారం కారణంగా తలెత్తే పరిస్థితులకు అనువుగా శిశువు తనను మార్చుకోవడం వల్ల ఈ మార్పులు సంభవించే అవకాశం ఉందని వారు తెలిపారు. వీరు సాధారణ శిశువుల కంటే 30 శాతం అధిక బరువుతో ఉంటున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలంటే గర్భవతులకు పౌష్ఠికాహారం ఇవ్వడంతో పాటు జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని వారు తెలిపారు.