: అభిమానుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకు చేతకాదు...వారు నా గుండెల్లో ఉంటారు!: మహేష్ బాబు
తొలిసారి తన ఆడియో వేడుకకి తన పాప సితార వచ్చిందని, అంతా మంచే జరుగుతుందని ప్రముఖ నటుడు మహేష్ బాబు చెప్పాడు. హైదరాబాదులోని బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను సత్యరాజ్ గారి సినిమాలు చూసి, ఆయనను చాలా అభిమానించే వాడినని, అలాంటి నటుడితో నటించడం గర్వంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో గొప్పగొప్ప నటీనటులు ఎంతో మందితో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ సినిమాకు తొట తరణి అద్భుతమైన ఆర్ట్ సెట్ల రూపంలో అందించాడని అన్నాడు. ఆయన తన అర్జున్ సినిమాకు మరింత అద్భుతమైన సెట్ వేశారని అభినందించారు. అలాగే తాను రత్నవేల్ కు ఫోన్ చేయగానే ఈ సినిమా చేస్తున్నానని అంగీకరించారని, ఆయన లొకేషన్లను మరింత అద్భుతంగా తీశారని మహేష్ కితాబునిచ్చాడు. శ్రీకాంత్ అడ్డాలతో తనకు మంచి స్నేహం ఉందని మహేష్ అన్నాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కంటే మంచి కథను బ్రహ్మోత్సవానికి ఇచ్చాడని అన్నారు. శ్రీకాంత్ అడ్డాల సినీ పరిశ్రమతో పెద్దగా కలవకపోవడం వల్లే చాలా 'ప్యూర్'గా ఉన్నాడనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. శ్రీకాంత్ అడ్డాలతో ఇలా మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నానని మహేష్ బాబు అభిలషించాడు. పరుచూరి బ్రదర్స్ తో చాలా సినిమాలు చేశానని మహేష్ బాబు గుర్తు చేసుకున్నాడు. వారితో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాత పీవీపీ అడిగిన ప్రతీదీ ఇచ్చారని అన్నారు. బ్రహ్మోత్సవం లాంటి గొప్ప విజయవంతమైన సినిమాలు పీవీపీ చాలా చేయాలని ఆయన ఆకాంక్షించాడు. చివరగా అభిమానుల గురించి మాట్లాడుతూ, తానెప్పుడూ అభిమానుల గురించి ఆడియో వేడుకల్లో పెద్దపెద్ద మాటలు మాట్లాడలేదని గుర్తు చేశాడు. నా దృష్టిలో మనకి ఎవరిమీదైనా నిజంగా ప్రేమ ఉంటే వారి గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడమని అన్నాడు. వారిని నిరంతరం గుండెల్లో పదిలంగా దాచుకుంటామని చెప్పాడు. తనను ప్రతి నిమిషం ప్రోత్సహించే అభిమానులను గుండెల్లో దాచుకుంటానని మహేష్ బాబు తెలిపాడు. ఈ సినిమాను కూడా తన గత సినిమాల్లాగే ఆదరిస్తారని కోరుకుంటున్నానని మహేష్ బాబు ఆకాంక్షించాడు.