: ‘అమ్మ’ నాలుగు గోడల మధ్యే ఉండిపోయింది: రాహుల్
తమిళులకు పురచ్చితలైవిగా సుపరిచితురాలైన ముఖ్యమంత్రి జయలలితపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడులోని మధురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎంకే స్టాలిన్ తో కలసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ముఖ్యమంత్రి జయలలిత పనితీరు గురించి ప్రస్తావిస్తూ... గతేడాది వరదలు చెన్నైను ముంచెత్తినప్పుడు ఆమె నాలుగు గోడల మధ్యే ఉండిపోయింది. ప్రజలను చూసేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు రాలేదు. అని విమర్శించారు. నాలుగు గోడల మధ్యే కూర్చుని పాలించే ప్రభుత్వం తమిళులకు అవసరం లేదన్నారు. వరదల సమయంలో క్షేత్ర స్థాయికి రావాలన్న కనీస మర్యాద ఆమెకు తెలియదని దెప్పి పొడిచారు. తాను ఢిల్లీ నుంచి తమిళనాడుకు వచ్చి బాధితులకు అండగా నిలబడితే, ముఖ్యమంత్రి ఇల్లు దాటి రాకపోవడాన్ని తప్పుబట్టారు. ఏఐడీఎంకే పాలనలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయాయన్నారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడాన్ని జయలలిత అసమర్థ పాలనకు నిదర్శనాలుగా పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకునే ఈవీ రామస్వామి, కామరాజ్, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి వంటి నేతల వారసత్వాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ కరుణానిధి కుమారుడు స్టాలిన్ కు కూడా అలాంటి విలువలు ఉన్నాయని ప్రశంసించారు. ఈ నెల 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.