: సెంచరీతో శివాలెత్తిన కోహ్లీ...బెంగళూరును రేసులో నిలిపిన వైనం!


టోర్నీలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కెప్టెన్ కోహ్లీ ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ లో అంతా తానై జట్టును నడిపించిన కోహ్లీ స్పూర్తిమంతమైన విజయం అందించి, తానెంత విలువైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ జట్టు రహానే (74), సౌరభ్ తివారీ (108) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టుకు కోహ్లీ, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆచితూచి ఆడిన రాహుల్ (38) ను అండగా చేసుకున్న కోహ్లీ తొలుత జాగ్రత్తగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. రాహుల్ ను అవుట్ చేసిన జంపా, ఆ వెంటనే విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ (1) ను కూడా అదే ఓవర్లో చివరి బంతికి పెవిలియన్ కు పంపాడు. దీంతో బెంగళూరు మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించింది. దీంతో రంగప్రవేశం చేసిన షేన్ వాట్సన్ తొలి రెండు బంతులను డిఫెన్స్ ఆడాడు. 14వ ఓవర్ లో శివాలెత్తాడు. పెరీరా వేసిన ఆ ఓవర్ లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టి తన ఉద్దేశ్యం ఏమిటో చెప్పాడు. ఆ తరువాత పెరీరా వేసిన 15వ ఓవర్ లో కోహ్లీ ఓ ఫోర్ కొడితే, వాట్సన్ రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో వాట్సన్ అవుట్ కావడంతో దూకుడు తగ్గింది. అయితే చెక్కుచెదరని దీక్షతో 18 వ ఓవర్ లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు, 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం ఖరారు చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీ నిలిచాడు. ఈ విజయంతో టోర్నీలో బెంగళూరు జట్టు నిలబడే అవకాశాలు మెరుగుపరుచుకుంది.

  • Loading...

More Telugu News