: గాల్లో ఎగిరే బైక్ తయారు చేసిన యువకుడు
బ్రిటన్ కు చెందిన కొలిన్ ఫర్జ్ అనే యువకుడు హాలీవుడ్ సినిమాల స్పూర్తితో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికి, అభిరుచి ఉంటే ఏ రంగంలోనైనా దూసుకుపోవచ్చని నిరూపిస్తున్నాడు. హాలీవుడ్ లో వచ్చే సైన్స్ ఫిక్సన్ సినిమాలను అభిమానించే ఫర్జ్ ఆ సినిమాల్లో కనిపించే తరహా వాహనాలను రూపొందించాలని భావించాడు. దీంతో సరికొత్త హోవర్ బైక్ (గాల్లో ఎగిరే బైకు) ను రూపొందించాడు. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆయన డ్రిఫ్టింగ్ బైకులు, చక్రాల చెత్తబుట్టలు వంటివి రూపొందించాడు. వాటి స్పూర్తితో హోవర్ ఈ బైక్ కు రూపకల్పన చేశాడు. పరిశ్రమల్లో ఉపయోగించే రెండు పెద్ద పెద్ద ఫ్యాన్లను ఓ ఇనుప రాడ్ కు అమర్చడం ద్వారా హోవర్ బైక్ ను రూపొందించాడు. ప్రయోగ దశలో ఉన్న ఈ హోవర్ బైక్ ప్రస్తుతానికి గాల్లోకి లేస్తోంది కానీ, మరీ ఎత్తులో ఎగరలేకపోతోంది. దీనికి మరిన్ని హంగులు కూర్చడం ద్వారా ఎత్తుకు నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. మెకానికల్ విభాగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా, కేవలం అభిరుచితో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తున్న కొలిన్ ఫర్జ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.