: మోదీ జాతకం మొత్తం మీ దగ్గర ఉందన్నారు... మరి నోరెందుకు విప్పడం లేదు: కాంగ్రెస్ కి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
మోదీ జాతకం మొత్తం గాంధీ కుటుంబం చేతిలో ఉందని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది...ఇంతకీ గాందీ కుటుంబం చేతిలో ఏముంది? దానిని తక్షణం బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అగస్టా స్కాంపై నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. రెండు పార్టీలు కలిసే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మోదీ తన విద్యార్హతల విషయంలో దేశ ప్రజలను మోసం చేశారని తాము సాక్ష్యాధారాలతో నిరూపిస్తుండగా, దానిపై కాంగ్రెస్ పార్టీ కానీ, సోనియా, రాహుల్ గాంధీలు కానీ కనీసం నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పవచ్చని దీని అర్థమా? అని ఆయన నిలదీశారు. అధికారాలు చేతిలో ఉంచుకుని కేంద్రం నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో కాంగ్రెస్ అగ్రనేతలు తప్పు చేశారని ఆరోపిస్తున్నప్పుడు దోషులపై సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని ఆయన నిలదీశారు. తమకు నెల రోజుల పాటు పోలీసు యంత్రాగాన్ని అప్పగిస్తే...నిజానిజాలు వెలికి తీస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు యంత్రాగంపై అధికారం కల్పించే ధైర్యం కేంద్రానికి ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.