: ఆ గ్రామ జనాభా 2,500 మంది.... 350 ఆత్మహత్యలు... మాయరోగం కబళిస్తోంది!
ఆర్థిక అభివృద్ధి ఫలాలు అందరికీ చేరని ఫలితం, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాల ఫలితం ఆ గ్రామానికి వెళితే కళ్లకు కడుతుంది. ఒకరో ఇద్దరో కాదు, ఓ పది మంది కూడా కాదు. ఇప్పటి వరకు 350 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఖార్గోర్ లో బాడి గ్రామానికి వెళితే కన్నీరు పెట్టించే ఇలాంటి గాథలు వినిపిస్తాయి. బాడి గ్రామ సర్పంచ్ జీవన్ రెండు నెలల క్రితం తన ఇంటి ముందు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇప్పుడు సర్పంచ్ బాధ్యతలను అతని సోదరుడు సిసోడియా తీసుకోవాల్సి వచ్చింది. జీవన్ తల్లి, సోదరుడు కూడా ఆత్మహత్యలతోనే తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఈ గ్రామంలో 2,500 మంది జనాభా ఉంటే గత ఇరవై ఏళ్ల కాలంలో 350 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ అమిత్ సింగ్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలోనే 80 మంది బలవంతంగా తనువు చాలించినట్టు చెప్పారు. ‘గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ఒక్కరైనా ఆత్మహత్య చేసుకున్నవారి చరిత్ర ఉంటుంది. గ్రామంలో 320 కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒకరైనా బలవంతపు మరణాన్ని కోరుకుని వెళ్లిపోయినవారే’ అని గ్రామ సర్పంచ్ సిసోడియా భారమైన గుండెతో చెప్పుకొచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అన్న ప్రశ్నకు సర్పంచ్ సిసోడియా స్పందిస్తూ... ఈ గ్రామంలో దెయ్యం తిరుగుతోంది. అందుకే ఇలా అవుతోందని అమాయకంగా చెప్పారు. కానీ నిపుణులు మాత్రం మానసిక ఒత్తిడి, దిగులుతోపాటు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పేర్కొంటున్నారు. వ్యవసాయంలో ఆర్గానోఫాస్పేట్ అనే మందు అధికంగా ఉపయోగించడం వల్ల కూడా దాని ప్రభావం డిప్రెషన్ కు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు.