: అగస్టా స్కాంలో ‘ఎక్స్ ఫ్యాక్టర్’!... అందాల భామను ఎరవేసిన ‘వెస్ట్ ల్యాండ్’!
కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. రూ.3,200 కోట్ల విలువ కలిగిన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ... డబ్బుతో పాటు అందాల భామను కూడా ఎర వేసింది. జర్మనీలో పుట్టి లండన్ లో సెటిలైన అందాల సుందరి క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్ ను... ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ఎరగా వాడుకున్నాడు. తొలుత తన కంపెనీలో ఆమెకు డైరెక్టర్ పదవిని ఇచ్చిన మైఖేల్... ఆ తర్వాత అగస్టా స్కాంలో ఆమెను ఎరగా వేశాడు. డబ్బుతో పాటు మైఖేల్ ఎరగా వేసిన స్ల్పిడ్ కు భారత్ కు చెందిన అధికారులతో పాటు రాజకీయ నేతలు కూడా డంగైపోయారు. గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసుకుని, స్ల్పిడ్ అందానికి దాసోహమైపోయి అగస్టాతో డీల్ ఓకే చేశారు. వివరాల్లోకెళితే... ప్రస్తుతం 31 ఏళ్ల వయస్సున్న స్ల్పిడ్... 2009లో మైఖేల్ కంపెనీలో డైరెక్టర్ గా చేరింది. నాడు నవ యవ్వనంలో ఉన్న స్ల్పిడ్ ను రంగంలోకి దించి అందాల విందు చేయించిన మైఖేల్... తన పనిని ఇట్టే చక్కబెట్టుకునేవాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెలికాప్టర్ల కోసం భారత్ జారీ చేసిన టెండర్ ను దక్కించుకునేందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ మైఖేల్ ను రంగంలోకి దింపింది. సూట్ కేసుల నిండా డబ్బులు, 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న స్ల్పిడ్ తో కలిసి రంగంలోకి దిగిన మైఖేల్ ఢిల్లీ, దుబాయిల కేంద్రంగా చక్రం తిప్పాడు. ఈ క్రమంలో స్ల్పిడ్ లావణ్యానికి ముగ్ధులైన భారతీయ రాజకీయ నేతలు, అధికారులు అగస్టాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇటలీ కోర్టు సంచలన తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో విచారణకు హాజరైన న్యాయవాది గౌతం ఖైతాన్... స్ల్పిడ్ ప్రమేయానికి సంబంధించిన కొత్త కథ గుట్టు విప్పాడు. 2010, 2013లలో భారత్ తో పాటు దుబాయికి పలుమార్లు వచ్చిన స్ల్పిడ్... భారత అధికారులతో పాటు రాజకీయ నేతలను కలిసినట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పక్కా ఆధారాలు సంపాదించినట్లు సమాచారం. ఈ క్రమంలో స్ల్పిడ్ ను తమ విచారణకు అనుమతించాలని కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే బ్రిటన్ కు లేఖలు రాసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. స్ల్పిడ్ ప్రమేయం, ఆమె విచారణకు లేఖ రాసిన విషయాలను పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీబీఐ అధికారి ధ్రువీకరించారు.